సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య డిమాండ్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 22(నమస్తే న్యూస్).
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అల్వాల వీరయ్య డిమాండ్ చేశారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ తాటికొండ అనంతచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినా హామీని అమలు చేయలేదని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు.రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులతో పాటు డీఎస్సీ,జేఎల్,డీఎల్,గ్రూప్-1,2,3,4 కేటగిరీ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలన్నారు.ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని,రాజీవ్ యువ వికాస పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ భద్రత కల్పించాలని,ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఉండ్రాళ్ల మధుసూదన్,మండల నాయకులు బాణాల రాజన్న,కొండ ఉప్పలయ్య,అల్వాల యాకమ్మ,తాడూరి వీరేంకులు,చెన్నబోయిన లాలయ్య,నలబోరు లక్ష్మారెడ్డి,ఎస్.కె.ఇమామ్ సాబ్,మొగిలి యాకయ్య,పోలేపాక గణేష్,ఎల్లమ్మ,భూక్యా చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు.

