
మహబూబాబాద్ ,ఆగస్ట్ 13 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ప్రముఖ సురేందర్ కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. గురువారం నాడు గ్రామంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని గ్రామ పెద్దలు చీరిక ఉపేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని, సురేందర్ కంటి దవాఖాన వారు కంబాలపల్లిలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు, వృద్ధులు తమ కంటి చూపు సమస్యలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని, వైద్యుల నుంచి తగిన సలహాలు, సూచనలు పొందారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అభిలాష్, వైద్య సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు, యువకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దవాఖాన యాజమాన్యం మరియు నిర్వాహకులు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.