రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 21 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.254లో ఖాస్ర పహాణి ప్రకారం 10.01,కుంట లో మిగిలి ఉన్న 9.01 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని బి ఎస్ పి పాలేరు అసెంబ్లీ కమిటీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా
బిఎస్ పి పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము పూలే మాట్లాడుతూ ప్రభుత్వ భూమికి గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు తొలగించబడిందని, సరిహద్దు రాళ్లు కూడా స్పష్టంగా లేకపోవడంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు అవకాశం ఏర్పడుతోందని తెలిపారు.
ఇంత స్పష్టంగా ప్రభుత్వ భూమి పరిరక్షణ అంశం ముందుకు వచ్చినప్పటికీ సంబంధిత మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి విషయంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే, తిరుమలాయపాలెం మండలానికి మంజూరైన ITI కళాశాల కోసం కూడా సర్వే నం.254లోని ప్రభుత్వ భూమి వాస్తవ పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలని కోరారు.
కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని సర్వే నం.254 లో పూర్తి స్థాయి అధికారిక సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూమికి శాశ్వత సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయించాలని బి.ఎస్.పి డిమాండ్ చేసింది.
అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, తొలగించిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని కోరింది.
“ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి. అది అన్యాక్రాంతమైన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు—ఇప్పుడే కాపాడాలి. కలెక్టర్ తక్షణమే స్థల పరిశీలన చేయించి 9.01 ఎకరాల ప్రభుత్వ భూమికి పూర్తి రక్షణ కల్పించాలి” అని బి ఎస్ పి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నల్లగట్టు శంకర్, తదితరులు పాల్గొన్నారు..
