- ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటానికి సిద్ధం కావాలి.
- గత ప్రభుత్వ విజయాలను పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలి.
- కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం... సైనికుల వలె పనిచేయాలి.
- సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల దృస్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.
- బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ దిశా నిర్దేశం.
డోర్నకల్/మరిపెడ,జూన్ 10(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా మరిపెడ కేంద్రంగా డోర్నకల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు.నియోజకవర్గంలో పార్టీ బలోపేతం,భవిష్యత్ కార్యాచరణ,ప్రజా సమస్యలపై పోరాటం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి,డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.తెలంగాణ సాధన నుండి రాష్ట్ర అభివృద్ధి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని గుర్తు చేశారు.కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్యకర్తలే పార్టీకి బలమని,నియోజకవర్గంలో ప్రతి ఇంటికి,ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాలను,గత ప్రభుత్వ విజయాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని,రైతు,యువత,మహిళల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.రాబోయే కాలంలో పార్టీని గ్రామస్థాయి నుండి మరింత పటిష్టం చేయాలని సూచించారు.ప్రతి బూత్ కమిటీని క్రియాశీలం చేసి,యువతను,మహిళలను పెద్దఎత్తున పార్టీలో భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని,తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉందని నాయకులు ఉద్ఘాటించారు.కేసీఆర్ విజన్ 2030 ప్రకారం తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుని ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,సీనియర్ నాయకులు అచ్యుత్ రావుతో పాటు నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,యువజన,రైతు విభాగాల నాయకులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లి,ప్రజలతో మమేకమై పనిచేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

