ఒక్క వాన చాలు.. రైతు కలల పంట పండేందుకు!
రిపోర్టర్:కారంపురి వెంకటేశ్వర్లు నేత(7893556455)
సెంటర్:మరిపెడ.
మరిపెడ,జూన్ 12 (నమస్తే న్యూస్)
తెల్లారితే చాలు,రైతన్న కళ్లు తూర్పు దిక్కునే.సూర్యుని కొరకు కాదు...నల్లని మబ్బు కనిపిస్తుందేమోనని ఆశ.చేతిలో నాగలి,గుండెల్లో గుబులు.కాలం రానే వచ్చింది జూన్ దాటుతున్నా ఆకాశం,వరుణ దేవుడు కరుణించడం లేదు,ఆకాశం మాత్రం ఇంకా కన్నెర్ర జేస్తూనే ఉంది.
దుక్కిలోనే ఆగిన కల
రైతులందరూ యుద్దానికి సిద్ధంగా ఉన్న సైనికుల్లా పలుగు,పార,నాగలి,విత్తనాలు సిద్ధం చేసుకొని వర్షం కొరకు వేయి కనులతో ఎదిరి చూస్తున్నారు.చాలామంది రైతులు దుక్కి దున్ని 15 రోజులు దాటింది.పత్తి,కంది,మొక్కజొన్న విత్తనాలు సంచుల్లోనే మగ్గుతున్నాయి.పొలం గట్ల మీద కూర్చొని రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు."ఒక్క జల్లు పడితే చాలు...ఈ దుక్కిలో మేము చెమట కాదు,బంగారం పండిస్తాం.గతేడు సమయానికి వానలు రాక పంటలు ఎండిపోయినయ్.ఈసారి అప్పు తీరాలంటే తొలకరి పలకరించాలి" అని రైతుల ఆవేదన. బీడువారిన నేల నోరు తెరిచి వాన చుక్క కోసం తపిస్తోంది.రైతుకు వ్యవసాయం బతుకు కాదు...అది జీవితం,నమ్మకం.ఆ నమ్మకానికి ఊపిరి పోసేది ఒక్క వరుణుడే.
వాన.. వరమా శాపమా?
రైతు బతుకంతా పందెమే.విత్తనం భూమిలో పడాలంటే వాన కావాలి.వాన పడ్డాక తెగులు రాకుండా ఉండాలి.పంట చేతికొచ్చే దాకా అతివృష్టి,అనావృష్టి భయం."కంపెనీలో పనిచేసే వారికి నెలాఖరుకు జీతం.కానీ మాకు ఆకాశం వైపు చూసి బతకాలి.ఒక్కసారి వాన సమయానికి పడక పంట కాలం దాటిందంటే ఏడాదంతా అప్పులే" అంటూ కౌలు రైతుల గోడు.వడ్డీకి తెచ్చిన సొమ్ము విత్తనం,ఎరువు మీద పెట్టారు.ఇప్పుడు వాన కోసం దేవుడికి మొక్కని గుడి లేదు.
ప్రభుత్వ భరోసా.. ఆశల దీపం
అయినా రైతు ఒంటరి కాదు.రైతుబంధు,రైతుబీమా,ఉచిత కరెంట్ లాంటి పథకాలు కొంత ధైర్యం ఇస్తున్నాయి.వ్యవసాయ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ సలహాలు ఇస్తున్నారు.వాతావరణం అనుకూలించగానే విత్తనం వేయండి,నకిలీ విత్తనాల బారిన పడకండి" అని అధికారులు సూచిస్తున్నారు.ఆర్గానిక్ ఎరువులు వాడండని సూచిస్తున్నారు, పొలాల్ల,చేలుకల్లో పెంట,చెరువు రేగడి పోసి పంట పండిస్తే భూమి భూసారం పెరుగుతుందని సలహాలు ఇస్తున్నారు.రైతువేదికలు అందుబాటులో ఉండడం కూడా రైతుకు కొండంత అండ.
ఖరీఫ్ రణం..సై అంటున్న అన్నదాత
ఓటమికి భయపడని రైతు యుద్ధానికి సిద్ధమయ్యాడు.దుక్కి దున్నడం పూర్తయింది.విత్తనాలు,ఎరువులు ఇంటికొచ్చేశాయి.ట్రాక్టర్ వారితో మాట్లాడుకున్నారు.కూలీలకు మాట ఇచ్చాడు.ఇక వరుణుడు కరుణిస్తే చాలు...పొలం పనుల యుద్ధ రంగంలోకి దిగెటందుకు సరన్ సిద్ధం చేసుకొని ఆకాశం వైపు అన్నదాత చూపు. రుతుపవనాలు కేరళ తీరం తాకాయని వార్త వచ్చినప్పటి నుంచి రేడియోలో వాతావరణ సూచనలు వింటూనే ఉన్నాడు.ఫోన్‌లో వాతావరణ యాప్ చూస్తూనే ఉన్నాడు.టివిల్లో వార్తలు వింటూనే ఉన్నారు.ప్రతి సాయంత్రం పడమటి ఆకాశంలో మెరుపు కోసం వెతుకులాట. ఈసారి మేఘమాల కదలాలి.వరుణుడు కరుణించాలి.ఎందుకంటే రైతు చెమట చుక్క భూమ్మీద పడాలంటే,ముందు ఆకాశం నుంచి వాన చుక్క పడాలి.పంట చేతికొచ్చి,గిట్టుబాటు ధర దొరికితేనే అన్నదాత ఇంట సంక్రాంతి. ఒక్క చినుకు చాలు...విధి రాత మార్చేందుకు.ఒక్క జల్లు చాలు...రైతింట సిరులు పండేందుకు.ఆ చినుకు కోసమే కోటి కళ్లతో ఎదురుచూపు.ఆకాశమే హద్దుగా ఏదరు చూపులతో సాగుతున్న అన్నదాత నిరీక్షణ.

