Type Here to Get Search Results !

సూర్యాపేటను రాష్ట్రంలోనే అత్యంత సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దుతాం:ఎస్పీ నరసింహ ఐపీఎస్.

సూర్యాపేటను రాష్ట్రంలోనే అత్యంత సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దుతాం.

:ఎస్పీ నరసింహ ఐపీఎస్.




సూర్యాపేట, జూన్ 19 (నమస్తే న్యూస్ డెస్క్): సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని రాష్ట్రంలోనే అత్యంత సురక్షిత పట్టణంగా అభివృద్ధి చేసేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన సమగ్రంగా తనిఖీ చేశారు.


పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది గౌరవ వందనం పలికారు. అనంతరం కవాతును పరిశీలించిన ఎస్పీ సిబ్బంది యూనిఫామ్‌లు, కిట్లు, విధి నిర్వహణ తీరు పరిశీలించారు. పోలీస్ సిబ్బందితో ముఖాముఖి సమావేశమై విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్పీ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, శాంతిభద్రతల ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, కేసులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టులతో సమన్వయం పెంచి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేసే దిశగా పట్టణంలోని కీలక ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా పట్టణంపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఫిర్యాదు అందిన వెంటనే బాధితుల ఇంటికే వెళ్లి కేసులు నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.రౌడీషీటర్లు, భూకబ్జాదారులు, సంఘవిద్రోహ శక్తులపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా "ఆపరేషన్ రోప్" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ తనిఖీ కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మగ్దూం అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్సైలు ఏడుకొండలు, మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రహిముద్దీన్, ఏఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.