- తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు.
- అమరవీరుల త్యాగాలను గౌరవించాలి.
- యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్ హెచ్చరిక.
డోర్నకల్/మరిపెడ(జూన్ 03)నమస్తే న్యూస్:తెలంగాణ ఉద్యమ చరిత్రను,అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజయ్ నాయక్ అన్నారు.ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకుడు,నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు."తెలంగాణ గడ్డ మా జాగీరే,మా తాతల జాగీరే"అనే నినాదంతో ఆంధ్ర పాలకుల పెత్తనం మాకొద్దనే ఏకైక లక్ష్యంతో తొలి దశ,మలి దశ తెలంగాణ ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మబలిదానాలు చేసుకున్నారని తెలిపారు.నాటి ఉమ్మడి ప్రభుత్వం ఎన్నో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసినా,తెలంగాణ యువత వాటిని లెక్కచేయలేదని అన్నారు."తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతే మా రాష్ట్రంలో మా ఉద్యోగాలు సంపాదించుకుంటాం" అనే గట్టి సంకల్పంతో పుస్తకాలను పక్కనపెట్టి ఉద్యమ బాట పట్టారని చెప్పారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం,కాకతీయ విశ్వవిద్యాలయాలను ఉద్యమ వేదికలుగా మార్చుకొని విద్యార్థి లోకం అలుపెరుగని పోరాటం చేసిందని వివరించారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న నాయకుడని,తెలంగాణ బిడ్డల త్యాగాలను గౌరవిస్తారని ఇన్నాళ్లూ భావించామని అన్నారు.కానీ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలంగాణ భావజాలం,ఇక్కడి ఉద్యమ చరిత్ర పట్ల ఆయనకు సరైన అవగాహన లేదని స్పష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ పరిణతి ఉన్న నాయకుడెవరైనా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా మాట్లాడాలి కానీ,వాటిని గాయపరిచేలా కాదని సూచించారు.తెలంగాణలో చాలామంది పవన్ కళ్యాణ్‌ను రాజకీయాలకు అతీతంగా ఒక సినిమా నటుడిగా అభిమానిస్తారని,అయితే ఆ అభిమానాన్ని అలుసుగా తీసుకొని తెలంగాణను తక్కువ చేసి మాట్లాడితే ఇక్కడి ప్రజలు,యువత ఎప్పటికీ అంగీకరించరని హెచ్చరించారు.తెలంగాణ చరిత్ర,సంస్కృతి,అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని,బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు మాట్లాడేటప్పుడు చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని విజయ్ నాయక్ డిమాండ్ చేశారు.

