- గుర్రప్ప తండ పంచాయితీలో ప్రజాపాలన ప్రగతి సభ.
- తాగునీరు,రోడ్లు,డ్రైనేజీపై సర్పంచ్ శరత్ హామీ.
- సీజనల్ వ్యాధులపై అవగాహన.
- పోషకాహారం,పరిశుభ్రతపై అధికారుల పలు సూచనలు.
డోర్నకల్/మరిపెడ,జూన్ 06(నమస్తే న్యూస్) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండ గ్రామ పంచాయితీలో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభను సర్పంచ్ భానోత్ శరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామాభివృద్ధి,ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ శరత్ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే తమ తొలి ప్రాధాన్యత అన్నారు.గ్రామంలో ఉన్న సమస్యలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని తెలిపారు.ఇందుకోసం నిధులు మంజూరు చేయించి,పనులను వేగవంతం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.అనంతరం వైద్య,అంగన్వాడీ శాఖల అధికారులు మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల నివారణ సాధ్యమని వివరించారు.
చిన్నపిల్లలు,బాలింతలు,గర్భిణులకు సమతుల పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తల్లులకు సూచించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలు,మహిళా సంఘాల నాయకులు,గ్రామ పెద్దలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.

