- గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : ఎస్సై బానోతు వెంకన్న
- నర్సింహులపేటకు గంజాయి టెస్టింగ్ కిట్లు
నర్సింహులపేట, జూన్ 5 (నమస్తే న్యూస్)మత్తు పదార్థాల నియంత్రణకు నర్సింహులపేట పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక గంజాయి టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నర్సింహులపేట ఎస్సై బానోతు వెంకన్న తెలిపారు.నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనుమానం వచ్చిన వ్యక్తులను ఈ ప్రత్యేక కిట్ల సహాయంతో అక్కడికక్కడే పరీక్షించి, కేవలం పది నిమిషాల్లోనే గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించే అవకాశం ఉందన్నారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి వద్ద ఈ కిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.గంజాయి వినియోగదారులను శిక్షించడం కంటే వారిలో మార్పు తీసుకురావడమే పోలీసు శాఖ ప్రధాన ఉద్దేశమని ఎస్సై పేర్కొన్నారు. అందుకే మత్తు పదార్థాలకు బానిసైన యువతను డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ జీవన విధానంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.నర్సింహులపేట మండలాన్ని సంపూర్ణ గంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు. మండలంలో ఎక్కడైనా గంజాయి విక్రయం, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 8712656987 నంబర్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.గంజాయి అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్న నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అయితే తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడిన యువతను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.మంచి మార్పును కోరుకునే ప్రజలు, మేధావులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, జర్నలిస్టులు పోలీసు శాఖతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ సమిష్టిగా కృషి చేస్తే నర్సింహులపేట మండలంలో మత్తు పదార్థాలకు స్థానం ఉండదని ఎస్సై బానోతు వెంకన్న పేర్కొన్నారు.



