- మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా ఎండి ఖాజామియా.
- వారు చేసిన పోరాటాల త్యాగ ఫలితమే నాడు స్వరాష్ట్రం ఏర్పడింది.
- 60 ఏళ్ల పోరాటం.. అమరవీరుల త్యాగ ఫలితం.
- త్యాగాల తడిలో మొలకెత్తిన తెలంగాణ.
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యమకారుడు 'ఖాజామియ' పై నమస్తే న్యూస్ ప్రత్యేక కథనం.
![]() |
| గోనె సంచుల ఇంటిలో మగ్గిపోతున్న ఉద్యమకారుడు. |
నర్సింహులపేట, జూన్ 2 (నమస్తే న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎండి ఖాజామియా చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.
తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేశారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎండి కాజా మియా విశేషంగా కృషి చేశారని ఉద్యమ సహచరులు గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నర్సింహులపేట మండలం రిపోర్టర్ చెలిమల్ల గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలే ప్రధాన కారణమని అన్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ఉద్యమ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు.మలిదశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను ప్రభుత్వం, సమాజం గుర్తించాలని ఆయన కోరారు. కనీసం ఉద్యమకారులకు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు గూడు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్రానికి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.





