ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం జరగాలి: ఎస్పీ డా. శబరీష్
తోర్రూరు,జూన్ 29(నమస్తే న్యూస్):
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసు అధికారులు పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పష్టం చేశారు. సోమవారం తోర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, పోలీసు పనితీరు, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసు డైరీలు, పెండింగ్ కేసులు, పోక్సో కేసులు, మహిళలపై నేరాల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ.. దర్యాప్తులో నాణ్యత పెంచడంతో పాటు పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం సీఐలు, ఎస్‌ఐలతో సమావేశమైన ఆయన.. ప్రజలతో నిరంతరం మమేకమై స్థానిక సమాచారాన్ని సేకరించాలని, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
తదనంతరం చింతలపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ డా. శబరీష్.. గ్రామస్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.గ్రామాల్లో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలను అరికట్టడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. అలాగే రాత్రివేళ దొంగతనాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేర నియంత్రణలో కీలకమని చెప్పారు.అత్యవసర సమాచారం, భద్రతా హెచ్చరికలు, అనుమానాస్పద ఘటనలను వెంటనే పంచుకునేందుకు గ్రామ స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఎస్పీ..శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని,పోలీసులు-ప్రజల సమన్వయంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


