- సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలి.
- CCTNS ద్వారా ప్రతి పిటిషన్, కేసు వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్ నమోదు చేయాలి.
- గంజాయి నేరస్థులు, విక్రేతలు, రవాణాదారులపై నిరంతర నిఘా కొనసాగించాలి.
- – జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.
మహబూబాబాద్,జూన్ 11(నమస్తే న్యూస్ డెస్క్)మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాసిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు Crime and Criminal Tracking Network & Systems (CCTNS) ను వంద శాతం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు (Complaint/Petition) మరియు ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను ఎఫ్‌ఐఆర్ నమోదు దశ నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు తప్పనిసరిగా CCTNSలో నమోదు చేసి, ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్ ఎంట్రీ చేయాలని, దర్యాప్తు పురోగతి, నిందితుల వివరాలు, కేసు స్థితిగతులను సకాలంలో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
CCTNS ద్వారా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, క్యారెక్టర్ సర్టిఫికెట్లు, దొంగిలించబడిన వాహనాల ట్రాకింగ్ వంటి ప్రజా సేవలను వేగవంతంగా అందించవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ అమలులో నిర్లక్ష్యం లేదా అలసత్వం సహించబోమని హెచ్చరించారు.మహబూబాబాద్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. గంజాయి విక్రేతలు, రవాణాదారులు, పాత గంజాయి కేసుల నిందితులు మరియు మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట కౌన్సిలింగ్ నిర్వహించాలని, మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు, వాహనాల తనిఖీలు మరియు విస్తృత నిఘా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి, కార్డన్ అండ్ సెర్చ్,కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో భద్రత భావం తీసుకురవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా క్షేత్రస్థాయిలో కఠిన అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
డిజిటల్ సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు CCTNSలో అందుబాటులో ఉన్న నేర చరిత్ర సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలను సమర్పించడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేసి, జిల్లా కన్విక్షన్ రేటును పెంచేందుకు ఇన్వెస్టిగేషన్ అధికారులంతా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
"మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో కేవలం నిన్న ఒక్కరోజే 119 గ్రామపంచాయతీలు, 09 వార్డులలో సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు కలిసి రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన, సీసీ కెమెరాల ఏర్పాటు, గంజాయి రహిత గ్రామాల నిర్మాణం తదితర అంశాలపై ప్రత్యేక తీర్మానాలను ఆమోదించడం పట్ల జిల్లా ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేసిన ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.అనంతరం జిల్లాలో పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అభినందించి ప్రోత్సాహకాలను అందజేశారు.

