వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి:సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే న్యూస్): వర్షాకాల సీజన్‌లో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో వర్షాకాల సన్నద్ధతపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. జూన్ 9న హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు, అధికారుల మధ్య సమన్వయ లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.వర్షాల సమయంలో మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ట్రాఫిక్ జామ్‌లు పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల భద్రత, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, తాగునీటి నాణ్యత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.వ్యవసాయ సీజన్ నేపథ్యంలో విత్తనాలు, యూరియా సరఫరాపై పర్యవేక్షణ పెంచాలని, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

