- ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ధర్నా.
- పని కల్పించకుండా అడ్డుకుంటున్న టెక్నికల్ అసిస్టెంట్.
- ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో ఆఫీస్ ముందు కూలీల బైఠాయింపు.
నర్సింహులపేట, జూన్ 11 (నమస్తే న్యూస్):ఉపాధి హామీ పనులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన ఉపాధి హామీ కూలీలు గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.గత కొన్ని రోజులుగా ఉపాధి పనులు కల్పించకపోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ గత వారం రోజులుగా పనులు అడుగుతున్నప్పటికీ స్థానిక టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) స్పందించడం లేదని ఆరోపించారు. పనులకు సంబంధించి పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో ఆరు రోజులు పని చేసినప్పటికీ మస్టర్లలో నాలుగు రోజుల హాజరు మాత్రమే నమోదు చేసి, రెండు రోజుల కూలి కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పథకం కింద తమకు చట్టబద్ధంగా లభించాల్సిన పనులను వెంటనే కల్పించాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కూలీలు డిమాండ్ చేశారు.
టెక్నికల్ అసిస్టెంట్ మొండివైఖరికి నిరసనగా ఉపాధి కూలీలంతా ఏకమై ఎంపీడీవో కార్యాలయం ముందు భారీగా ఆందోళన చేపట్టారు.అయితే ధర్నా సమయంలో ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో కూలీల ఆగ్రహం మరింత పెరిగింది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో మండల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అనంతరం విధులకు ఆలస్యంగా హాజరైన సూపరింటెండెంట్‌కు మహిళా కూలీలు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను వివరించారు. ఉపాధి పనులు వెంటనే ప్రారంభించి కూలీలకు న్యాయం చేయాలని కోరారు.

