తడిసిన ధాన్యం కు గిట్టుబాటు ధరకు హామీ ఇవ్వాలి.
:అఖిల భారత రైతు కూలీ సంఘం
దంతాలపల్లి,మే 05(నమస్తే న్యూస్)
దంతాలపల్లి మండలం పడమటి గూడెం స్టేజ్ వద్ద ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం తొర్రూరు డివిజన్ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా సంఘం డివిజన్ అధ్యక్షుడు చిర్ర యాకన్న మాట్లాడుతూ, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ‘రంగు మారింది’ అంటూ తిరస్కరించడం రైతులపై అన్యాయం అని ఆరోపించారు. రైతు కళ్లముందే పంట నష్టపోతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతు పెట్టుబడి భారీగా పెరిగిందని, కానీ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం తీవ్ర సమస్యగా మారిందన్నారు. ఎంఎస్పీ అమలు కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఖర్చుపై 50 శాతం లాభంతో మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం, తూకాలు, గోనె సంచులు లేకపోవడం వంటి లోపాలు ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని కేంద్రాలను సదుపాయాలతో ప్రారంభించాలని, రైతులకు చట్టబద్ధంగా గిట్టుబాటు ధర హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలను పట్టించుకోకపోతే గ్రామాల నుంచి ఉద్యమం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.

