ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..!
స్టాక్ బ్లాక్ చేసినా సహించము : ఎస్సై భానోత్ వెంకన్న.
రైతులకు అవసరమైన మేర ఎరువుల నిల్వలు ఉంచాలి:ఏఓ వినయ్ కుమార్.
ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా ఎరువుల విక్రయాలు జరుపాలి.
నర్సింహులపేట,మే 26(నమస్తే న్యూస్)
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేయాలని, అధిక ధరలకు విక్రయించినా లేదా స్టాక్స్ బ్లాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సింహులపేట ఎస్సై భానోత్ వెంకన్న, మండల వ్యవసాయ అధికారి (ఏఓ) వినయ్ కుమార్ హెచ్చరించారు.మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఫెర్టిలైజర్ డీలర్లు, ముఖ్యంగా ఎరువుల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉండడంతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారని, రైతుల అవసరాలకు అనుగుణంగా తగినంత ఎరువుల నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.రైతుల నుంచి ఆధార్ కార్డు, పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను సేకరించి, వారి అవసరానికి అనుగుణంగా మొదటి, రెండో, మూడో విడతల వారీగా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రతి విక్రయంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు.అలాగే దుకాణాల ముందు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల స్టాక్ వివరాలను రైతుల సౌకర్యార్థం స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మౌనిక, పెట్ లేజర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

