Type Here to Get Search Results !

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు: కలెక్టర్ స్నేహ శబరిష్

రైతుసమస్యల పరిష్కారమే లక్ష్యం.

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

-కలెక్టర్ స్నేహ శబరిష్.


(రిపోర్టర్.పడిదం నరేందర్;సెంటర్. తొర్రూరు డివిజన్)
మహబూబాబాద్, మే 12 (నమస్తే న్యూస్): ఇటీవల మహబూబాబాద్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొర్రూరు పట్టణం, మండలం, పెద్దవంగర మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు నాయకులతో కలిసి జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, తేమ శాతం పేరుతో ధాన్యం తిరస్కరణ, తూకం ఆలస్యం, గన్నీ బ్యాగుల కొరత, రవాణా సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. ముఖ్యంగా అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు.రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు తాగునీరు, నీడ, టోకెన్ విధానం వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. అదేవిధంగా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి మధ్యవర్తుల జోక్యానికి అవకాశం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయాలపై స్పందించిన కలెక్టర్ స్నేహ శబరిష్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమర్థవంతంగా చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.