ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం..?అర్హులకు పనులు దక్కక అవస్థలు.క్షేత్రస్థాయిలో అవకతవకలపై విమర్శలు..!
నర్సింహులపేట,17 మే (నమస్తే న్యూస్):
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నర్సింహులపేట మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఉపాధి అవసరమైన పేద కార్మికులకు పనులు కల్పించకుండా, తమకు అనుకూలంగా ఉన్న కొంతమందికే అవకాశాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్రామాల్లో దుకాణాలు నిర్వహించే వారు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారి పేర్లతో కూడా ఇంటి వద్దనే ఫోటోలు అప్లోడ్ చేసి హాజరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు కూలీలు పనులకు సిద్ధంగా ఉన్నప్పటికీ “పనులు లేవు” అంటూ తిరస్కరిస్తున్న ఘటనలు ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉపాధి పనుల పర్యవేక్షణ కూడా తూ తూ మంత్రంగా సాగుతోందని, కేవలం పై అధికారులకు టార్గెట్లు చూపించడానికే పరిమితమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత, హాజరు, కార్మికుల హక్కులపై సరైన తనిఖీలు లేకపోవడంతో పథకం అసలు లక్ష్యం నీరుగారుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అర్హులైన ప్రతి కార్మికుడికి పారదర్శకంగా పనులు కల్పించాలని, ఫీల్డ్ స్థాయిలో ప్రత్యేక విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అలాగే గ్రామాల్లో నిజంగా పని చేసే కూలీలకే ఉపాధి హామీ ప్రయోజనాలు అందేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


