రాష్ట్రస్థాయి ప్రతిభతో రాణించిన హాసిని కి ఘన సన్మానం
(నమస్తే న్యూస్, సిరోల్, ఏప్రిల్ 15):
ప్రఖ్యాత పారిశ్రామిక వ్యాపారవేత్త, నానావత్ భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో భవిష్యత్తు తరాలను నిర్మించేందుకు చేపట్టిన ప్రతిభా పురస్కారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి పరీక్షా ఫలితాలలో రాణించిన విద్యార్థిని హాసిని కి భూపాల్ నాయక్ టీం అరుదైన గుర్తింపు అందించింది. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన అకోజు శ్రీను, అనిత దంపతుల కుమార్తె హాసిని ఖమ్మంలోని ఎస్సార్ జూనియర్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించగా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 991 మార్కులు సాధించి రాష్ట్రంలో తృతీయ స్థానం సాధించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఉప్పరగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సిరోల్ మండల కోఆర్డినేటర్ డీఎస్ రామ్మూర్తి నాయక్ అధ్యక్షతన, గ్రామ సర్పంచ్ మలికంటి సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యువ దళపతి భూపాల్ నాయక్ టీం సభ్యులు హాసిని కి పుష్పగుచ్చం అందించి, మిఠాయి తినిపించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాసిని సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో చదువుకుని జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థిని గుర్తించి ఇలాంటి ఘన సన్మానాలు నిర్వహించడం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీం సభ్యులు, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణు నాయక్, మరిపెడ ఎడెల్లి వెంకన్న, డోర్నకల్ ఇన్చార్జ్ శంకర్ నాయక్, నరసింహులపేట గణేష్, చిన్నగూడూరు శంకర్ నాయక్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

