Type Here to Get Search Results !

పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్. శ్రీమన్నారాయణ రెడ్డి

పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్. శ్రీమన్నారాయణ రెడ్డి



(నమస్తే న్యూస్, మహబూబాబాద్):

యువతకు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) ను జిల్లాలో అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్. శ్రీమన్నారాయణ రెడ్డి సూచించారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం లక్షా ఇరవై ఐదు వేల మంది యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రస్తుతం మూడో దశలో అభ్యర్థులకు అందించే నెలవారీ స్టైఫండ్‌ను రూ.9,000కు పెంచినట్లు తెలిపారు. అదనంగా వన్‌టైమ్ గ్రాంట్‌గా రూ.6,000 కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పథకానికి 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న యువత అర్హులని తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రముఖ సంస్థలలో ప్రత్యక్ష పని అనుభవంతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించబడతాయని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఐటీ, తయారీ తదితర 24 రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ శిక్షణలో భాగస్వామ్యమవుతున్నట్లు వెల్లడించారు.

ఇంటర్న్‌లకు నెలవారీ స్టైఫండ్‌తో పాటు వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా కల్పించబడుతుందని, ఈ పథకం ద్వారా శిక్షణ పొందిన యువతకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హులైన యువత ఈ నెల 28వ తేదీ లోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ ఎస్. శ్రీమన్నారాయణ రెడ్డి కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.