Type Here to Get Search Results !

ప్రతిభా పురస్కారం అవార్డుకు శ్రీకారం చుట్టిన కిసాన్ పరివార్.

ప్రతిభా పురస్కారం అవార్డుకు శ్రీకారం చుట్టిన కిసాన్ పరివార్.



(నమస్తే న్యూస్ డెస్క్, హైదరాబాద్, ఏప్రిల్ 15):

రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులలో విద్యా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఒకప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందిన “ప్రతిభా పురస్కారం” అవార్డును తిరిగి పునరుద్ధరించేందుకు కిసాన్ పరివార్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ నానవత్ భూపాల్ నాయక్ దూరదృష్టితో ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నానవత్ భూపాల్ నాయక్ ఓ ప్రకటన లో మాట్లాడుతూ, ప్రతిభా పురస్కారం అనేది విద్యార్థులను విద్యాపరంగా రాణించేందుకు ప్రోత్సహించే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేవలం పేరుకే పరిమితం చేయకుండా, దాని వారసత్వాన్ని బాధ్యత గల పౌరులుగా ముందుకు తీసుకెళ్లడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రతి పౌరుడు దేశం గర్వించే విధంగా ఎదిగి, పన్ను చెల్లింపుదారుడిగా సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో విద్య కీలక పాత్ర పోషించి, లక్షలాది మంది జీవితాలను మారుస్తూ వారికి కొత్త దిశను చూపిందని గుర్తు చేశారు. ప్రతిభా పురస్కారం పునరుద్ధరణ ద్వారా ఆయన దార్శనికతకు వినయపూర్వక నివాళి అర్పిస్తున్నామని తెలిపారు.

ఈ అవార్డుల కింద పదవ తరగతిలో టాపర్‌గా నిలిచిన బాలురు, బాలికలు (సీబీఎస్సీ, ఐసీఎస్సీ), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం (అన్ని స్ట్రీమ్‌లలో) టాపర్‌గా నిలిచిన విద్యార్థులను ఎంపిక చేసి సత్కరించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్‌లు, నగదు బహుమతులు మరియు గుర్తింపు అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

విద్యా ప్రతిభను గుర్తించి వేలాదిమంది విద్యార్థులను అంకితభావంతో, పట్టుదలతో విద్యను అభ్యసించేలా ప్రేరేపించడమే కిసాన్ పరివార్ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరివర్తనకు విద్యే కీలకమని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడంలో కిసాన్ పరివార్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.