ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి:
శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్.
(నమస్తే న్యూస్ డెస్క్, హైదరాబాద్, ఏప్రిల్ 17)
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యాఖ్యలపై శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యకం చేశారు.బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం అనేది సాధారణంగా ఏర్పడినది కాదని, ఇది ప్రజల దీర్ఘకాల పోరాటం మరియు అమరుల త్యాగాల ప్రతిఫలమని ఆయన పేర్కొన్నారు. అలాంటి చరిత్రను అవమానించడం అనేది తెలంగాణ ప్రజల గౌరవాన్ని అవమానించడం వంటిదేనని స్పష్టం చేశారు.ఈ వ్యాఖ్యలకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మియాపూర్ కాంగ్రెస్ నాయకులు,యువనేత యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవం పై ఎవరైనా దాడి చేస్తే యువత ముందుండి ప్రతిస్పందిస్తుంది. మా రాష్ట్ర గౌరవాన్ని కాపాడటం మా బాధ్యత. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ప్రజల ముందు క్షమాపణ చెప్పాల్సిందేనని హెచ్చరించారు.అలాగే, తెలంగాణ సాధనకు దారితీసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ సేవలను గుర్తు చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా అదే పార్టీ ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజనులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

