Type Here to Get Search Results !

మినరల్స్ లేకుండా ‘మినరల్ వాటర్’… ప్రజలను మోసం చేస్తున్న ప్లాంట్లు!

•మినరల్స్ లేకుండా ‘మినరల్ వాటర్’…ప్రజలను మోసం చేస్తున్న ప్లాంట్లు!

•మినరల్ వాటర్ మాయాజాలం.
ప్రజల ఆరోగ్యంతో వ్యాపారుల ఆటలు!

•కూల్ వాటర్ పేరుతో కలుషిత వ్యాపారం…ప్రమాదంలో ప్రజారోగ్యం.

•₹5 నీళ్లు ₹200కి… వేసవిలో మూడుపువ్వులు ,ఆరుకాయలుగా  వాటర్ దందా.

•“వాటర్ ఫ్రిడ్జ్‌లలో, డ్రై ఫ్రిడ్జ్‌లలో రోజుల తరబడి డిస్పోజబుల్ ప్లాస్టిక్ బాటిల్ లలో నిల్వ.

•నిల్వ నీటిలో పెరుగుతున్న  ప్రమాదకరమైన  బ్యాక్టీరియా.

•పర్యవేక్షణ లేకపోతే ప్రాణాలకు ముప్పు… కల్తీ నీళ్లపై షాకింగ్ నిజాలు!”




(నమస్తే న్యూస్ డెస్క్,మహబూబాబాద్,మార్చి 25)
వేసవి కాలం వచ్చిందంటే చల్లని నీళ్లకు డిమాండ్ పెరగడం సహజమే. అయితే ఈ అవసరాన్ని అవకాశంగా మార్చుకుని కొంతమంది వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. “మినరల్ వాటర్” పేరుతో విక్రయిస్తున్న నీరు నిజంగా మినరల్స్ కలిగి ఉందా? లేక కేవలం ఫిల్టర్ చేసిన సాధారణ నీరేనా? అనే సందేహాలు పెరుగుతున్నాయి.కేవలం 5 రూపాయల వ్యయంతో సేకరించిన 20 లీటర్ల నీటిని 100 నుండి 200 రూపాయల వరకు విక్రయించడం ద్వారా ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు చిన్న పట్టణాల్లో ఈ దోపిడీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజలు “శుద్ధమైన నీరు” అని నమ్మి కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఆ నీటిలో సహజ లవణాలు (మినరల్స్) లేకపోవడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది.వాటర్ ప్లాంట్లలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, విచ్చలవిడిగా కెమికల్స్ ఉపయోగించడం, మరియు పరిశుభ్రత లోపించడం వల్ల నీరు కలుషితమవుతోంది.ఇటువంటి ప్లాంట్లలో తరచుగా తుప్పు పట్టిన పైపులు, పేరుకుపోయిన పాచి, మురికిగా ఉన్న ఫిల్టర్లు, అపరిశుభ్రమైన బాటిల్స్ కలుషితాన్ని పెంచుతాయి.ఫిల్టర్ ప్రక్రియలో అవసరమైన మినరల్స్ తొలగిపోవడం వల్ల తాగునీరు నిస్సారంగా మారుతోంది. అంతేకాకుండా, డ్రై ఫ్రిడ్జ్‌లు మరియు వాటర్ ఫ్రిడ్జ్‌లలో రోజుల తరబడి నిల్వ ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలకి అవకాశం ఏర్పడుతోంది.


        ఈ కలుషిత నీటిని సేవించడం వల్ల గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్యంపై ఇంతటి ప్రభావం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన పర్యవేక్షణ చేయకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది.

      అనుమతులు లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లు, నిబంధనలు పాటించని యూనిట్లు, మరియు నాణ్యత లేని నీటిని విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యం కంటే లాభాలను ముందుకు పెట్టే ఇలాంటి వ్యాపారులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తాగునీరు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, మూలం, మరియు ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఆరోగ్యం మీద రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.

          వేసవి కాలంలో తాగునీటి అవసరం అత్యంత కీలకంగా మారుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రాలు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రుల పరిసరాలు వంటి ప్రజా రవాణా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉచిత త్రాగునీటి సదుపాయాలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి. సురక్షితమైన, శుద్ధమైన నీటిని అందుబాటులో ఉంచడం ద్వారా కల్తీ నీటి విక్రయాలను నియంత్రించడమే కాకుండా, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం కూడా తగ్గించవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా RO ప్లాంట్లు, వాటర్ కూలర్లు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలి. శుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా నియమిత తనిఖీలు నిర్వహించాలి. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.