డిఫాల్ట్ మిల్లర్లపై నిబంధనల ప్రకారం చర్యలు: అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్, ఆగస్టు 11, (నమస్తే న్యూస్ డెస్క్):
ప్రభుత్వానికి అందజేయాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్)ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్‌కుమార్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో సీఎంఆర్ డెలివరీ పురోగతి, పెండింగ్‌లో ఉన్న బియ్యం నిల్వలు, ఎఫ్‌సీఐకి అందించాల్సిన సీఎంఆర్, బిల్లుల చెల్లింపులు, డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు.సీఎంఆర్ డెలివరీలో వెనుకబడిన మిల్లర్లు తమ వద్ద ఉన్న పెండింగ్ స్టాక్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వానికి అప్పగించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వానికి బియ్యం అప్పగించడంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.గత సీజన్లకు సంబంధించిన బకాయిలు, రికవరీలు, డిఫాల్ట్ మిల్లర్ల అంశాలను కూడా సమీక్షించారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మిల్లర్లకు సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలని, జిల్లాలో ధాన్యం సేకరణ, బియ్యం సరఫరా ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగానికి మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు.సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.



