79 మంది కుష్ఠు బాధితులకు చికిత్స.. ఉచితంగా మందుల పంపిణీ
మహబూబాబాద్, ఆగస్టు 11, (నమస్తే న్యూస్ డెస్క్):
జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు. కుష్ఠు వ్యాధి నివారణకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నోడల్ పర్సన్లు, సూపర్వైజర్లతో జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 79 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులకు చికిత్స, మందులు అందిస్తున్నట్లు తెలిపారు. కుష్ఠు వ్యాధి లక్షణాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.శరీరంపై రాగి రంగులో లేదా ఇతర రంగులో మొద్దుబారిన మచ్చలు, ఆ ప్రాంతంలో స్పర్శజ్ఞానం లేకపోవడం, మచ్చపై వెంట్రుకలు లేకపోవడం, చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే కుష్ఠు వ్యాధిగా అనుమానించి నిర్లక్ష్యం చేయరాదన్నారు. అలాంటి లక్షణాలు ఉన్న వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని సూచించారుకుష్ఠు వ్యాధికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా మందులు, చికిత్స అందిస్తున్నందున ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. మహబూబాబాద్ జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు నోడల్ పర్సన్లు, సూపర్వైజర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.కార్యక్రమంలో కుష్ఠు వ్యాధి కార్యక్రమ అధికారి డాక్టర్ అర్జున్, డీపీఎంవోలు సతీష్‌రెడ్డి, వాలియా, డిప్యూటీ డెమో రాజకుమార్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కుష్ఠు వ్యాధి నోడల్ పర్సన్లు పాల్గొన్నారు.

