పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడే గ్రూప్–1, గ్రూప్–2, ఎస్సై, కానిస్టేబుల్, బ్యాంకింగ్ పుస్తకాలు
మహబూబాబాద్, ఆగస్టు 11, (నమస్తే న్యూస్ డెస్క్)
భావితరాల విజ్ఞాన వికాసానికి పుస్తకానికి మించిన సాధనం మరొకటి లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం తన సొంత ఖర్చుతో రూ.30 వేల విలువైన పుస్తకాలను ఆయన వితరణ చేశారు.గ్రూప్–1, గ్రూప్–2, ఎస్సై, కానిస్టేబుల్, బ్యాంకింగ్, జూనియర్ లైన్మెన్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు అట్లాస్, ఇండియన్ పాలిటీ, తెలంగాణ చరిత్ర, భారత చరిత్ర తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు.ఈ సందర్భంగా వెన్నం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పుస్తకాలు మనకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చేయడంతో పాటు మన ఆలోచనలు, నడవడికను సక్రమ మార్గంలో నడిపిస్తాయని అన్నారు. భావితరాల విజ్ఞానం కోసం పుస్తకానికి మించిన సాధనం లేదన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసిన ఈ వితరణపై గ్రంథాలయ పాఠకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు జి.విజేందర్, రుద్రారపు వీరేందర్, నరసింగం శ్రీనివాస్, మందుల రఘు, భూలక్ష్మి యాదమ్మతో పాటు గ్రంథాలయ పాఠకులు గోపాల్, నవీన్, సురేష్, ప్రవల్లిక, జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు.

