RTIకి విచిత్ర సమాధానం.. ఉద్యోగి మృతి చెందడంతో సమాచారం లేదట!
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వృద్ధుడు
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 11 (నమస్తే న్యూస్)
ప్రభుత్వ పథకం కింద పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని 20 ఏళ్లు గడిచినా ఫలితం దక్కకపోవడంతో ఓ వృద్ధుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తన దరఖాస్తు పరిస్థితి, పెన్షన్ జాబితాలో పేరు ఎందుకు లేదనే సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేయగా.. సంబంధిత రికార్డులు అందుబాటులో లేవని, ఆ పని చూసే ఉద్యోగి మృతి చెందడంతో వివరాలు చెప్పలేమని అధికారులు సమాధానం ఇచ్చినట్లు బాధితుడు పేర్కొన్నారు.తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామానికి చెందిన రంగాపురం నర్సయ్య 2003లో కళ్లగీత కార్మిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.తనకు అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ జాబితాలో పేరు ఎందుకు లేదో తెలుసుకునేందుకు నర్సయ్య కుమారుడు రవి జూన్ 3న RTI కింద దరఖాస్తు చేశారు. జూలై 2న వచ్చిన సమాధానంలో కోరిన వివరాలు రికార్డుల్లో లేవని, సంబంధిత పని చూసే ఉద్యోగి విధుల్లో ఉండగానే మృతి చెందారని, ప్రస్తుతం ఆ బాధ్యతలను మరెవరికీ అప్పగించలేదని పేర్కొన్నట్లు బాధిత కుటుంబం తెలిపింది.
ఉద్యోగి మృతి చెందితే రికార్డులు ఉండవా?
సంబంధిత ఉద్యోగి మృతి చెందినందుకు రికార్డులు అందుబాటులో లేవని అధికారులు చెప్పడంపై బాధిత కుటుంబం ప్రశ్నలు సంధిస్తోంది. ఉద్యోగి మృతి చెంది రెండేళ్లు గడిచినా ఆ బాధ్యతలను మరొకరికి ఎందుకు అప్పగించలేదని, పాత రికార్డులను డిజిటలైజ్ చేయలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
కార్యాలయానికి వెళ్లిన సమయంలో తమ సమస్యను పూర్తిగా వినకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
20 ఏళ్లుగా నిరీక్షణ…అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
‘‘చిన్నప్పటి నుంచి చెట్లెక్కి కుటుంబాన్ని పోషించాను. ఇప్పుడు వయసు మీదపడింది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. చివరకు నా దరఖాస్తు వివరాలు అడిగితే ఇలా సమాధానం రావడం బాధగా ఉంది’’ అని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 3న నిర్వహించిన ప్రజావాణిలో నర్సయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. RTI చట్టం కింద కోరిన సమాచారాన్ని అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తనకు అర్హత ఉంటే తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని ఆయన కోరారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరాలంటే క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబం పేర్కొంది. జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ స్పందించి తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని నర్సయ్య కోరుతున్నారు.

