మరిపెడ,ఆగస్టు 11(నమస్తే న్యూస్).
మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం ఇటుకలగడ్డ తండ గ్రామపంచాయతీ, మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.ఇటుకలగడ్డ తండ మరియు గురుకుల కళాశాల పరిధిలో 150 మందికి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 100 మంది విద్యార్థినులకు వైద్య బృందం సమగ్ర పరీక్షలు నిర్వహించింది.మొత్తం 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గుగులోతు రవి మాట్లాడుతూ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు,విద్యార్థినులు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం ద్వారా డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరాల్లో స్వామి, కిరణ్, ఆరోగ్య పర్యవేక్షకులు ఆచార్యులు, ఆరోగ్య సహాయకులు శ్రీదేవి, నాగమణి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని సేవలు అందించారు.



