వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలి.
రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలి
ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500, 20 కేజీల బియ్యం అందించాలి.
ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 11 (నమస్తే న్యూస్)
వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రం, జిల్లా, మండల పరిధిలో నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్), అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య, ఏఐయూకేఎస్ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి పాశం అప్పారావు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుల సూచనలతో రైతులు వ్యవసాయ సాగుకు సిద్ధమై విత్తనాలు వేశారని తెలిపారు. అయితే అక్కడక్కడా చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు.విత్తిన విత్తనాలు కొన్నిచోట్ల మొలకెత్తినా, ఆ తర్వాత వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన స్వల్పకాలిక పంటల విత్తనాలు, ఎరువులను ఉచితంగా, సకాలంలో రైతుల క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి, ఒకేసారి రుణమాఫీ చేయాలని, కొత్తగా వడ్డీలేని పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు బీమా అమలు చేయడంతో పాటు పశుగ్రాసం, రాబోయే రోజుల్లో గ్రామాలకు తాగునీటి సరఫరా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ప్రాజెక్టులు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరక సాగు పనులు ముందుకు సాగడం లేదని నాయకులు పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని
వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల మేరకు వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 జీవన భృతి, 20 కేజీల బియ్యం అందించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ప్రత్యేకంగా కరువు భత్యం కూడా అందించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బందెల వెంకయ్య, పాశం అప్పారావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు రేపాకుల శివలింగం, ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, ఏఐయూకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పాశం అప్పారావు, కే. వెంకటేశ్వర్లు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, రెంటాల యాదగిరి, కూరాకుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

