200 కిలోల నల్లబెల్లం, 100 కిలోల చక్కెర, 12 కిలోల ఈస్ట్ స్వాధీనం.. యజమానిపై కేసు నమోదు

నర్సింహులపేట, ఆగస్టు 11 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్లో గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరుకులను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం అందిన సమాచారం మేరకు నర్సింహులపేట గ్రామంలోని సదరు సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేయగా గుడుంబా తయారీకి వినియోగించే నల్లబెల్లం, చక్కెర, ఈస్ట్ పొడి అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.తనిఖీల్లో 200 కిలోల నల్లబెల్లం, 100 కిలోల చక్కెర, 12 కిలోల ఈస్ట్ పొడి లభించడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడిసరుకులను నర్సింహులపేట మండలంలోని సమీప తండాలకు గుడుంబా తయారీ కోసం విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సూపర్ మార్కెట్ యజమాని జాటోత్ నరేష్, శంకర్ కుమారుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడుల్లో ఎన్. శంకర్ ఎస్ఐ, మధు హెచ్‌సీ, కానిస్టేబుళ్లు ప్రభాకర్, వెంకటస్వామి పాల్గొన్నారు. గుడుంబా తయారీకి ముడిసరుకుల సరఫరా, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


