సర్పంచ్ బోడమాంగిని శంకర్ ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్యాలు
మరిపెడ,ఆగస్టు 10(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండలో బంజారా సమాజానికి అత్యంత పవిత్రమైన తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో,సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి సర్పంచ్ బోడమాంగిని శంకర్ ఆధ్వర్యంలో తండా మహిళలు, యువతులు తీజ్ బుట్టలతో ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ బంజారా వస్త్రధారణలో ఉన్న మహిళలు తీజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తండా మేలు కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ తీజ్ పండుగ విశిష్టతను ప్రతిబింబించారు. డోలు చప్పుళ్లకు అనుగుణంగా చేసిన నృత్యాలు, పాటలు తండా అంతా సందడిని నింపాయి. తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. తీజ్ పండుగ సందర్భంగా సర్పంచ్ బోడమాంగిని శంకర్ మాట్లాడుతూ, బంజారా సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక అయిన తీజ్ పండుగను ప్రతి ఏటా ఇదే ఉత్సాహంతో జరుపుకోవాలని, మన ఆచారాలను, నృత్యాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు.ఈ సందర్భంగా తండా ప్రజలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడమాంగిని శంకర్ తో పాటు వార్డు సభ్యురాలు బోడ ధర్మ, ఇస్లావత్ నామ, మాజీ ఉపసర్పంచ్ బోడ రెడ్డి,తండా నాయకులు బోడ బాషా, బోడ లక్పతి, జర్నలిస్ట్ బోడ శీను, హేమ, తండా పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీజ్ వేడుకలు తండాలో ఐకమత్యానికి,సంస్కృతి పరిరక్షణకు నిదర్శనంగా నిలిచాయని గ్రామస్తులు అన్నారు.

