రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు.
రామన్నపేట,ఆగస్ట్ 10,(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంకేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రైతు–వ్యవసాయ కార్మిక–కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయ రంగంలో సంక్షోభం పెరుగుతున్నప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. రైతులకు రుణభారం తగ్గించి, పంటలకు సమగ్ర మద్దతు కల్పించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే విధంగా ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, పని దినాలు పెంచడంతో పాటు కూలి రేట్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఉపాధి, ఆహారం, ఇళ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచి కార్మికుల హక్కులను హరించే విధానాలను అవలంబిస్తోందని వారు ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
దేశ సంపదను సృష్టిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికుల ప్రయోజనాలను పక్కనపెట్టి కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ విధానాలు అనుకూలంగా మారుతున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
జైలు భరో కార్యక్రమంలో భాగంగా శాంతియుతంగా రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలను అణచివేయడం ద్వారా ప్రజల గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు.
రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు గన్నేబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్,, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కందుల హనుమతు,, సీఐటీయూ నాయకులు నకిరకంటి రాము, నాయకులు కల్లూరి నగేష్,మేడబోయిన శ్రీనివాస్,అవనగంటి నగేష్,బావండ్లపల్లి బాలరాజు, మునికుంట్ల లెనిన్, మేడి గణేష్, అప్పం సురేందర్, తాళ్లపల్లి జితేందర్, నాగటి లక్ష్మణ్, శానగొండ వెంకటేశ్వర్లు,బందెల బిక్షం, బుడ్డ ప్రసాద్,పల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.



