వీడిన పిండిప్రోలు వృద్ధురాలి దారుణ హత్య కేసు మిస్టరీ.
నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసుల సంచలన ఆపరేషన్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 9 (నమస్తే న్యూస్):
ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడిని నేరస్థుడిగా మార్చింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చుకునేందుకు పక్కింట్లో నివసించే వృద్ధురాలిపై కన్నేసిన యువకుడు.. ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దారుణ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో చోటుచేసుకుంది. జూలై 17 అర్ధరాత్రి జరిగిన ఈ హత్య కేసును కూసుమంచి సర్కిల్ పోలీసులు ఛేదించారు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయిన చికెన్ షాప్ యజమాని ఐతనబోయిన ప్రశాంత్ (26) ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి సహకరించిన అతని బామ్మర్ది సరగండ్ల మహేష్ (20)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు.
వ్యసనాల ఊబిలో పడి.. వృద్ధురాలిపై కన్ను
పోలీసుల వివరాల ప్రకారం.. పిండిప్రోలు గ్రామానికి చెందిన ఐతనబోయిన ప్రశాంత్ చికెన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మద్యం, ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి భారీగా అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో అప్పులు తీర్చేందుకు డబ్బు కోసం నేరానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.తన చికెన్ షాప్ సమీపంలో నివసించే వృద్ధ దంపతులను గమనించిన ప్రశాంత్.. వృద్ధురాలు సుగుణమ్మ మెడలో ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేశాడు. వాటిని దోచుకుంటే తన అప్పులు తీర్చుకోవచ్చని భావించి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. ఇనుప రాడ్డుతో దాడి
పథకం ప్రకారం జూలై 17 అర్ధరాత్రి సమయంలో ప్రశాంత్ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలను బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నించగా సుగుణమ్మ ప్రతిఘటించింది.ఆమె అరుపులతో విషయం బయటపడుతుందనే భయంతో ప్రశాంత్ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. నిందితుడు ఆమె మెడలోని బంగారు చైన్, నల్లపూసల గొలుసుకు సంబంధించిన 9 బంగారు బిళ్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల రుణం
హత్య అనంతరం దొంగిలించిన బంగారు చైన్‌ను ప్రశాంత్ తన బామ్మర్ది సరగండ్ల మహేష్‌కు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు.మహేష్ ఆ బంగారు ఆభరణాలను ఖమ్మంలోని ఓ బ్యాంకులో తన పేరు మీద తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకు లావాదేవీలు, సాంకేతిక ఆధారాలు దర్యాప్తులో కీలకంగా మారినట్లు పోలీసులు తెలిపారు.
నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
పిండిప్రోలులో జరిగిన హత్య ఘటనపై ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. కూసుమంచి సీఐ సంజీవ్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్, ఖమ్మం డీసీఆర్బీ ఎస్సై పి.సంతోష్, కూసుమంచి ఎస్సై జె.నాగరాజు, ప్రొబేషనరీ ఎస్సైలు హరికృష్ణ, దివ్య ఆధ్వర్యంలోని బృందాలు దర్యాప్తు చేపట్టాయి.సాంకేతిక పరిజ్ఞానం, సెల్‌టవర్ డేటా, అనుమానితుల కదలికలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తూ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలించారు.
తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరి అరెస్ట్
నిందితులు తిరుమలాయపాలెం రోడ్డులో సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా మాటువేశారు. ఆదివారం ఉదయం ప్రశాంత్, మహేష్‌లను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనంబంగారుబిళ్లలు :09మొబైల్ ఫోన్లు: 02ద్విచక్ర వాహనం ,ఇనుప రాడ్: హత్యకు ఉపయోగించిన ఆయుధం గోల్డ్ లోన్ రశీదు: బ్యాంకు రుణానికి సంబంధించిన పత్రం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారుల అభినందనలు
క్లిష్టమైన హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పూర్ణచందర్రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీను తదితర సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించి రివార్డులు అందజేశారు.

