భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ
పడమటిగూడెం లో అంబరాన్నంటిన బోనాల సంబురాలు

నర్సింహులపేట,ఆగస్టు 9 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం బోనాల జాతర ఉత్సవాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉప్పలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, గ్రామస్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండల్లో బోనాలను తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నడిగడ్డ రోడ్డు ప్రాంతంలోని గ్రామలో దేవతలైన ముత్యాలమ్మ, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.బోనాల జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళల భక్తి గీతాలు, డప్పు వాయిద్యాలతో గ్రామ పరిసరాలు మార్మోగాయి. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బోనాల జాతర వైభవంగా సాగింది.




