గ్రామ ప్రజల ఫిర్యాదుపై స్పందించిన ఏఈ రఫీ ఉద్దీన్
బయ్యారం, ఆగస్టు 8 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట–సింగారం గ్రామపంచాయతీ పరిధిలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంపై గ్రామ ప్రజలు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఏఈ రఫీ ఉద్దీన్ మాట్లాడుతూ.. కొత్తపేట ఫీడర్, సింగారం ఫీడర్ పరిధిలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి గాలులు, వర్షాల సమయంలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం జరుగుతోందన్నారు.అలాగే ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న ఎడ్జ్ ఫ్యూజ్‌లు తెగిపోవడం వంటి సమస్యల కారణంగా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మండల విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నామని ఏఈ తెలిపారు. చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా భవిష్యత్‌లో విద్యుత్ అంతరాయాలు తగ్గే అవకాశం ఉందన్నారు.చెట్ల కొమ్మల తొలగింపు పనుల సమయంలో కొంతమేర విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని, గ్రామ ప్రజలు సహకరించాలని ఏఈ రఫీ ఉద్దీన్ కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సందీప్, ఎస్ఎల్ఐ వీరభద్రం, ఇన్స్పెక్టర్లు సలీం, ఉపేందర్, ఏఎల్ఎం సాగర్, శంకర్‌తో పాటు మండల విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


