ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ బండారి మల్లయ్యకు ఆదివాసీ సంఘాల జేఏసీ సన్మానం
రిపోర్టర్: పిల్లల నరసింహారావు
సెంటర్: బయ్యారం
బయ్యారం, ఆగస్టు 8 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్గా ఎన్నికైన బండారి మల్లయ్యను బయ్యారం మండల ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు ఘనంగా సన్మానించారు.జేఏసీ చైర్మన్ వర్స ప్రకాష్, వైస్ చైర్మన్ అలెం కృష్ణలు బండారి మల్లయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్మషం లేని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా, రైతుల కష్టాలు, బాధలు తెలిసిన వ్యక్తిగా బండారి మల్లయ్యకు మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా ఆయన ఎన్నిక కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.వయసు రీత్యా పెద్దవారైన బండారి మల్లయ్య గతంలో రెండు పర్యాయాలు సొసైటీ డైరెక్టర్గా పనిచేశారని తెలిపారు. ప్రస్తుతం చైర్మన్గా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి అవసరాలను తీర్చాలని కోరారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఎలాంటి కొరత లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే ప్రభుత్వం నుంచి రైతులకు అందే సబ్సిడీలు, రుణాలు అర్హులైన రైతులకే పారదర్శకంగా అందేలా చూడాలని కోరారు. అధికార, అనధికార పార్టీ నాయకుల జోక్యానికి తావులేకుండా అర్హత ఆధారంగా రైతులకు ప్రయోజనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి కొర్సా నరేష్, నాయకులు చాట్ల సంపత్, ఇర్ప రాజేష్, ఊకె రామ్మూర్తి, శర్పా సతీష్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

