మహబూబాబాద్, ఆగస్టు 7(నమస్తే న్యూస్ డెస్క్):
వార్షిక తనిఖీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సీరోలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డులు, పోలీసింగ్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్ఎస్ (CCTNS) నిర్వహణ, డయల్-112 కాల్స్‌పై స్పందన, గ్రామాల సందర్శన వివరాలను ఎస్పీ సమీక్షించారు. అలాగే గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన సమాచార సేకరణ, గ్రామ స్థాయిలో అమలవుతున్న వి.పి.ఓ. (Village Police Officer) వ్యవస్థ పనితీరు, రాత్రి పహారా, సిబ్బంది వివరాలు, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలు, నేరాల పరిస్థితిపై క్షుణ్ణంగా పరిశీలించారు.పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డయల్-112 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని తెలిపారు.గ్రామాల సందర్శనలను నిరంతరం కొనసాగిస్తూ గ్రామస్థులతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సమాచార సేకరణను మరింత ముమ్మరం చేసి కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వి.పి.ఓ. వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, సైబర్ అవగాహన, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాత్రి పహారాలను పటిష్ఠంగా నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఎస్పీ.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజల పట్ల మర్యాదపూర్వక వైఖరి, బాధ్యతాయుత సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.ఈ వార్షిక తనిఖీలో డీఎస్పీ కృష్ణ కిషోర్, మరిపెడ సీఐ పవన్, సీరోలు ఎస్ఐ సంతోష్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



