జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వెల్లడివిద్యార్థుల కోసం సొంత నిధులతో షెడ్ నిర్మించిన ప్రధానోపాధ్యాయురాలు
నిమ్మతోట ఇందిరాకు ముఖ్యమంత్రి ప్రశంసలు.
పాఠశాల అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 6 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై వెలువడిన వార్తకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. పాఠశాల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పాఠశాల భవనం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదంలో ఉన్నప్పటికీ, గతంలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమంలో ఎంపికైనప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టలేదని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రధానోపాధ్యాయురాలు నిమ్మతోట ఇందిరా తన సొంత నిధులతో రూ.40 వేల వ్యయంతో తాత్కాలిక షెడ్ నిర్మించి తరగతులు నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల పట్ల ఆమె చూపిన బాధ్యత, సేవా దృక్పథం ఆదర్శప్రాయమని కొనియాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆమెను శాలువాతో సన్మానించి అభినందించారు.గోపాలపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు.పాఠశాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నందున నాణ్యతతో, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, ఏఎంఓ, ఎంఈఓ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


