పేరుకే బీరోలు గ్రామపంచాయతీ మౌలిక వసతులు కరువు. 10 వ వార్డ్ ప్రజల ఆవేదన.
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం ఆగస్టు 7,(నమస్తే న్యూస్).
బీరోలు గ్రామపంచాయతీ పరిధిలోని 10వ వార్డు బజార్లలో మౌలిక వసతుల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ బురదమయమై బజార్లను తలపిస్తున్న రోడ్లపై స్కూలు పిల్లలు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పిల్లలు జారిపాడిన సంఘటనలు గూడా ఉన్నాయని,అదే బురదలో ప్రతి రోజు పిల్లలు పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే రోడ్లు పూర్తిగా బురదమయంగా మారడంతో విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే గ్రామపంచాయతీ ఉన్నప్పటికీ బీరోలు లో ఇప్పటికీ సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని గ్రామస్థులు ఆరోపించారు. సమస్యలపై పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, కింది స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా బీరోలులోని సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు వంటి మౌలిక వసతులను వెంటనే కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీరోలు ప్రజలు విజ్ఞప్తి చేశారు. బీరోలు అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని 10 వ వార్డు స్థానికులు కోరుతున్నారు.


