ఆగస్టు 15 నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆసరా పింఛన్లుకుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు
తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 7 (నమస్తే న్యూస్):
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తిప్పారెడ్డిగూడెం గ్రామంలో రూ.2.10 కోట్లతో తిప్పారెడ్డిగూడెం–రాకాసి తండా బీటీ రోడ్డు, హైదర్ సాయిపేటలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, పాతర్లపాడులో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రాజారాంలో రూ.4.50 కోట్లతో రాజారాం–తుమ్మగూడెం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిప్పారెడ్డిగూడెం గ్రామానికి రూ.35.55 కోట్లు, హైదర్ సాయిపేటకు రూ.37 కోట్లు, పాతర్లపాడుకు రూ.29.25 కోట్లు, రాజారాం గ్రామానికి రూ.8.48 కోట్లు మంజూరు చేసి రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టినట్లు వెల్లడించారు.హైదర్ సాయిపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని స్వచ్ఛందంగా అందించిన శ్రీనును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాల ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించామని పేర్కొన్నారు.రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సన్నరకం వరికి కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామని, రైతులు పండించే అన్ని పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల విద్యాసంస్థల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పూర్తిస్థాయి పారదర్శకతతో అమలు చేస్తున్నామని, మొదటి దశలో 4.5 లక్షలు, రెండో దశలో 2.5 లక్షలు, హైదరాబాద్‌కు మరో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని, మూడో, నాలుగో విడతల్లో కూడా ఇండ్ల మంజూరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను త్వరలో పంపిణీ చేస్తామని, ఇంటి నిర్మాణ పురోగతికి అనుగుణంగా బిల్లులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా ఇళ్లు అందిస్తోందని స్పష్టం చేశారు.ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ల మంజూరు ప్రారంభమవుతుందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కొత్త పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో అర్హతే ఏకైక ప్రామాణికమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డీపీఓ వినోద్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

