తొర్రూరులోని ఎరువుల దుకాణాల్లో పోలీసు,వ్యవసాయ అధికారుల సంయుక్త తనిఖీలు.
తొర్రూరు,ఆగష్టు 7,(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వ్యవసాయ అధికారి (ఏఓ) రామ్ నర్సయ్య, తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, పురుగుమందులు, ఎరువుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పారాక్వాట్ గడ్డి మందులను ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా విక్రయిస్తే సంబంధిత దుకాణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు అనుమతించబడిన, నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని సూచించారు. అలాగే, దుకాణాల్లో లైసెన్సులు, స్టాక్ రికార్డులు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు కూడా పురుగుమందులు, కలుపు నివారణ మందులను అధీకృత ఎరువుల దుకాణాల నుంచే కొనుగోలు చేసి, వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విధంగా వినియోగించాలని అధికారులు సూచించారు.


