మరిపెడ, ఆగస్టు 7 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందు విక్రయించడంతో బీచ్రాజుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జరుపుల తండాకు చెందిన జరుపుల అక్షిత్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడని, ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్‌హెచ్‌పీఎస్ (లంబాడ హక్కుల పోరాట సంఘం) జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేశారు.శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభం శుభం తెలియని బాలుడికి నిషేధిత గడ్డి మందును విక్రయించడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన ఫెర్టిలైజర్ షాప్ యజమానిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.మండలంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయించబడుతున్నాయని, దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రతి నెలా ఫెర్టిలైజర్ షాప్ యజమానులతో సమావేశాలు నిర్వహించి నిషేధిత మందుల విక్రయాన్ని అరికట్టాలని సూచించారు.యువతను సన్మార్గంలో నడిపించేందుకు పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, కొంతమంది యువత క్షణికావేశానికి లోనై ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజమంతా బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నిషేధిత పురుగుమందులు, గడ్డి మందులు విక్రయించే వారిపై కఠిన చట్టాలు అమలు చేసి, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎల్‌హెచ్‌పీఎస్ ప్రధానంగా జరుపుల అక్షిత్‌కు న్యాయం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.- నిషేధిత గడ్డి మందు విక్రయించిన ఫెర్టిలైజర్ షాప్ యజమానిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలి.- అక్షిత్‌కు ఏదైనా అపాయం జరిగితే పూర్తి నష్టపరిహారాన్ని ఫెర్టిలైజర్ షాప్ యజమానే భరించాలి.- సంబంధిత అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.ప్రభుత్వం, అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ధర్నాలు చేపడతామని భూక్యా రామ్మూర్తి నాయక్ హెచ్చరించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అక్షిత్ త్వరగా కోలుకోవాలని సేవాల్ మహారాజ్‌ను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో కారంపురి వెంకటేశ్వర్లు, తేజావత్ మోహన్ నాయక్, గుగులోతు కవిత, రాజు నాయక్, బావా సింగ్ నాయక్, మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

