ఇందిరాను ఘనంగా సన్మానించిన టీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఇజ్రాయిల్, మాజీ సర్పంచ్ గడ్డి కొప్పుల రాజు.
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 7 (నమస్తే న్యూస్):గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తన సొంత ఖర్చులతో రేకుల షెడ్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయురాలు ఇందిరాపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె చేసిన సేవను గుర్తిస్తూ ఇటీవల పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనానికి స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలకు రూ.30 లక్షలతో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా టీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఇజ్రాయిల్, మాజీ సర్పంచ్ గడ్డికొప్పుల రాజు కలిసి ఉపాధ్యాయురాలు ఇందిరాను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయురాలు ఇందిరా చేసిన సేవ ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, విద్యార్థులకు సరైన వసతి, రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో స్వంత నిధులతో రేకుల షెడ్ నిర్మించడం అభినందనీయమని కొనియాడారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియా కథనానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయడం ఆనందదాయకమని తెలిపారు. నూతన భవనం నిర్మాణంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కలుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వారు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఇందిరా కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గడ్డికొప్పుల రాజు మాజీ సర్పంచ్ ఉన్నం వీరభద్రం గడ్డికొప్పుల సుధాకర్ దాసరి మెరిషమ్మ గడ్డికొప్పుల కిరణ్ ఎరగానీ సరస్వతీ గడ్డికొప్పుల ప్రసాద్ చింతపల్లి వీరబాబు కొప్పుల బాబు పేరం భార్గవి విసంపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

