నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకత.
మరిపెడ,ఆగస్టు 7(నమస్తే న్యూస్).
ప్రభుత్వ విధానాలకు నిరసనగా మరిపెడ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో నేనున్నాను అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా,సమస్యలు అలాగే ఉన్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా రావాల్సిన డి.ఏ లు,ఇప్పటికే ప్రకటించిన డి.ఏ ల బకాయిలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. మూడు సంవత్సరాల క్రితమే రావాల్సిన పి.ఆర్.సి ఇంతవరకు ఇవ్వలేదని, ఆరు డి.ఏ లను పెండింగ్ లో ఉంచి ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిస్తుందని ఆరోపించారు.ఒకవైపు ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం,ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే పి.ఆర్.సి లను,డి.ఏ లను ప్రకటించకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని అన్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన సి.పి.ఎస్ రద్దు హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నీటిలో మూటలుగానే మిగిలిపోయాయని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి దశ ఆందోళనలో భాగంగా ఈరోజు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసనలో పాల్గొన్నారు. జి.పి.ఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, పి.ఆర్.సి ని వెంటనే ప్రకటించాలి.పెండింగ్ డి.ఏ లను వెంటనే విడుదల చేయాలి. సి.పి.ఎస్ ను రద్దు చేసి ఓ.పి.ఎస్ విధానాన్ని అమలు చేయాలి. జి.ఓ 317 లో నిలిచిపోయిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నందిగామ జనార్ధనాచారి, మరిపెడ మండల టిఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ రావు,అధ్యక్షులు జి లింగా నాయక్,టి.పి.టి.ఎఫ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు హఫీజర్, పవన్ తో పాటు ఉపాధ్యాయులు నెహ్రూ, దేవ్లా, ప్రసాదరావు, గోవర్ధన్, మంగు నాయక్, లాల్ చంద్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


