మరిపెడ, ఆగస్టు 6 (నమస్తే న్యూస్):
ఒడిశా నుంచి నల్గొండకు కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు యువకులను మరిపెడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల 240 గ్రాముల గంజాయి, మారుతి సుజుకి బాలెనో కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.12 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.మరిపెడ సీఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఎస్సై గండ్రాతి సతీష్, సిబ్బంది ఇస్లావత్ రవీందర్, రమేష్, వెంకన్న, మహిళా పోలీసు శాంతలతో కలిసి పురుషోత్తమాయగూడెం వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన మారుతి సుజుకి బాలెనో కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వేగంగా వెళ్లేందుకు యత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా, డ్రైవర్ సీటు కింద ఎండు గంజాయి ప్యాకెట్ లభించింది. తూకం వేయగా అది 2 కిలోల 240 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. కారులో ఉన్న ఐదుగురు యువకులను విచారించగా, వారు గండికోట వంశీ (24), చిత్రం రాకేష్ (22), చింతల తిరుమలేష్ (24), కంచి మహేష్ (25), మాదాసు మహేష్ (26)గా గుర్తించారు. వీరంతా నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందినవారు.విచారణలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్గొండలో కారు అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, నల్గొండలో విక్రయించేందుకు తీసుకొస్తుండగా పట్టుబడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పవన్ కుమార్ తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు తగిన బహుమతి కూడా అందజేస్తామని తెలిపారు.

