మున్సిపల్ కార్మికులకు 21 వేల కనీస వేతనం అమలు చేయాలి.
కార్మికులకు ఈఎస్ఐ,ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.
మరిపెడ,ఆగస్టు 06(నమస్తే న్యూస్)
ప్రజల ఆరోగ్య పరిరక్షణ,పట్టణాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకు నెలకు 21 వేల రూపాయల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ డిమాండ్ చేశారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ఎస్బీఐ కాలనీలో మున్సిపల్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు ఎంతో కష్టపడుతున్నా వారికి తగిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్, ప్రమాద బీమా, భద్రతా పరికరాలు, ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని కార్మిక హక్కులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు. ప్రజలకు అత్యంత కీలకమైన సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, వారి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఉప్పలయ్య, పూల్ సింగ్, నరసయ్య, శీను, పెద్ద ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

