.నర్సింహులపేట, ఆగస్టు 6 (నమస్తే న్యూస్)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించి ప్రజా ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని నర్సింహులపేట గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య పేర్కొన్నారు.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెద్దమాముల యాకయ్య ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, “ఉద్యమం ఒక నినాదం కాదు… ఒక తరం ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ ప్రతీకకు పేరు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆయన. ఆయన త్యాగం, నిబద్ధత, సిద్ధాంతాలు నేటి రాజకీయ నాయకులకు, యువతకు, ఉద్యమకారులకు శాశ్వత మార్గదర్శకాలు. తెలంగాణ సమాజం ఆయన సేవలను ఎన్నటికీ మరువదని” అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అశోక్, గ్రామపంచాయతీ కార్యవర్గం సభ్యులు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

