ప్రతి ఉద్యోగికి సైబర్ భద్రతపై అవగాహన అవసరం: జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్.
సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ అవగాహన కార్యక్రమం ప్రారంభం
మహబూబాబాద్, ఆగస్టు 5 (నమస్తే న్యూస్): సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, ప్రతి కార్యాలయంలో ఉద్యోగులకు సైబర్ భద్రతపై నిరంతర అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో స్వాతంత్ర్య మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం సైబర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సైబర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులు, అధ్యాపకులతో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు.సదస్సులో స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ–కేవైసీ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా మోసాలు, కృత్రిమ మేధ (AI) ఆధారిత డీప్‌ఫేక్ మోసాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 30 శాతం పెట్టుబడి మోసాలేనని తెలిపారు. ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పొదుపు చేసిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకునే వారినే సైబర్ నేరగాళ్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు.సోషల్ మీడియాలో కనిపించే అధిక లాభాల హామీలు, అనుమానాస్పద లింకులు, తెలియని యాప్‌లు, పెట్టుబడి ఆహ్వానాలను నమ్మరాదని సూచించారు. ఎవరైనా “ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు” అని చెప్పినప్పుడు అది సైబర్ మోసానికి ప్రధాన సంకేతంగా గుర్తించాలని తెలిపారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు, బంధువులు లేదా స్నేహితుల పేరుతో వచ్చే కాల్స్, వీడియోలు, సందేశాలను వెంటనే నమ్మకుండా ముందుగా ధృవీకరించుకోవాలని సూచించారు.ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారు M-Kavach 2.0 వంటి భద్రతా యాప్‌ను ఉపయోగించాలని, మొబైల్లో అవసరం లేని యాప్‌లను తొలగించాలని, Sanchar Saathi/TAFCOP ద్వారా తమ పేరుపై నమోదైన సిమ్ కార్డులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. కాల్ ఫార్వర్డింగ్‌ను *#21# ద్వారా పరిశీలించి, అవసరమైతే ##002# ద్వారా రద్దు చేసుకోవచ్చని వివరించారు.అలాగే బహిరంగ ప్రదేశాల్లో USB పోర్టుల ద్వారా మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేయకుండా, స్వంత ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్‌ను మాత్రమే వినియోగించాలని, విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని సూచించారు.సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా లేదా ఆర్థిక నష్టం జరిగినా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే నేరగాళ్లను గుర్తించి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ నరేష్, ప్రభుత్వ మెడికల్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సైబర్ క్రైమ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.”సైబర్ భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదు… ప్రతి పౌరుడి బాధ్యత. అప్రమత్తతే సైబర్ మోసాలకు శాశ్వత నివారణ” అని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.




