కొత్తగూడ, ఆగస్టు 05(నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణ్యాతండా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సాగిన ఈ ప్రత్యేక తనిఖీల్లో పోలీసులు గ్రామంలోని సుమారు 200 ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలను గుర్తించారు.అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 32 లీటర్ల గుడుంబా, 120 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లం ఊటను (జాగరీ వాష్) అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గూడూరు సీఐ వినయ్ తెలిపారు.తనిఖీల అనంతరం గ్రామస్థులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి తదితర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై పోలీసులు వివరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని గ్రామ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఫోర్స్, తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP), ఆర్మ్డ్ రిజర్వ్ (AR) ఫోర్స్‌కు చెందిన మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



