నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం.. చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్?
తొర్రూరు,జూలై 06(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్స్లో కొనుగోలు చేసిన వరి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చెర్లపాలెం గ్రామానికి చెందిన రైతులు దర్శనాల మహేందర్, కుర్ర సుధాకర్, సింగారపు మధు తదితరులు మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో కేఎంఎం-1638 (వరుణ్ కంపెనీ) విత్తనాలను గత వారం రోజుల క్రితం కొనుగోలు చేసి సాగు చేసినట్లు తెలిపారు.అయితే విత్తనాలు నాటి రోజులైనా ఆశించిన స్థాయిలో మొలకలు రాకపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత ఫర్టిలైజర్స్ యాజమాన్యాన్ని సంప్రదించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.నకిలీ, నాణ్యతలేని విత్తనాల విక్రయం కారణంగా తమకు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి విత్తనాల నాణ్యతను పరీక్షించాలని, తప్పిదం నిర్ధారణ అయితే షాప్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులను మోసం చేస్తున్న వారిపై పోలీసులు మరియు సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు జరిగిన నష్టానికి తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

